41 ఏళ్ల వయసులో ఫాఫ్ డూప్లెసిస్ విధ్వంసం.. 46 బంతుల్లోనే సెంచరీ!

  • మేజర్ లీగ్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన ఫాఫ్ డుప్లెసిస్
  • 41 ఏళ్ల వయసులో 46 బంతుల్లోనే శతకం బాది రికార్డు
  • అసాధారణ రీతిలో 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన టెక్సాస్
  • సీటెల్ ఓర్కాస్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ శతకం వృథా
  • లీగ్‌లో నాలుగో సెంచరీతో అత్యధిక శతకాల రికార్డును సుస్థిరం చేసుకున్న ఫాఫ్
41 ఏళ్ల వయసులోనూ తనలో సత్తా తగ్గలేదని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ మరోసారి నిరూపించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే విధ్వంసకర శతకంతో చెలరేగాడు. సియాటెల్ ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఆఖరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించిన ఫాఫ్ (52 బంతుల్లో 113 నాటౌట్‌), తన వయసు కేవలం ఒక నంబర్ మాత్రమేనని చాటిచెప్పాడు.

డల్లాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టెక్సాస్ సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన సియాటెల్ ఆర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ హిట్టర్ టిమ్ సైఫర్ట్ (66 బంతుల్లో 104) అద్భుత సెంచరీతో కదం తొక్కగా, షయాన్ జహంగీర్ (47 బంతుల్లో 78) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో కెప్టెన్ మార్కస్ స్టాయినీస్ (3 బంతుల్లో 13) కూడా రాణించడంతో టెక్సాస్ ముందు భారీ లక్ష్యం నిలిచింది.

221 పరుగుల లక్ష్య ఛేదనలో టెక్సాస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు ఆటగాడు సాయితేజ ముక్కామల తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. రీలీ రోస్సో (21 బంతుల్లో 49)తో కలిసి పవర్‌ప్లేలోనే 89 పరుగులు జోడించి గట్టి పునాది వేశాడు. రోస్సో ఔటయ్యాక, మిలింద్ కుమార్, శుభమ్ రంజనే త్వరగానే పెవిలియన్ చేరినా ఫాఫ్ ఏమాత్రం తగ్గలేదు. విమాన్ ముల్దర్ (15 బంతుల్లో 31 నాటౌట్‌ )తో కలిసి మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించాడు.

ఫాఫ్ తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో సియాటెల్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ సెంచరీతో మేజర్ లీగ్ క్రికెట్‌లో డుప్లెసిస్‌కు ఇది నాలుగో శతకం. లీగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా తన రికార్డును మరింత పదిలం చేసుకున్నాడు. ఫాఫ్ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా టెక్సాస్ జట్టు 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Faf du Plessis
Major League Cricket
Texas Super Kings
MLC 2026
Faf du Plessis century
Seattle Orcas

More Telugu News